: టీసీఎస్ కు కృతజ్ఞతలతో స్వాగతం పలుకుతున్న బ్రిటన్!


ఇండియాలో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ప్రారంభించిన 'డిజిటల్ స్కిల్స్' స్కీమ్ కు బ్రిటన్ ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 మంది బ్రిటన్ గ్రాడ్యుయేట్లను ఐటీ విభాగంలో నైపుణ్యవంతులను చేయాలని టీసీఎస్ నిర్ణయించింది. ఇదొక అత్యద్భుత ప్రోగ్రామ్ గా అభివర్ణించిన బ్రిటన్ ఉద్యోగ శాఖా మంత్రి ప్రీతీ పటేల్, తాము మనస్ఫూర్తిగా టీసీఎస్ కు స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. "ఇదొక మంచి అవకాశం. వచ్చే నాలుగేళ్లలో 1000 మంది యూకే గ్రాడ్యుయేట్ల డిజిటల్ స్కిల్స్ లో నిష్ణాతులవుతారు. ఇందుకోసం టీసీఎస్ ఇంటర్న్ షిప్ మొదలు పెట్టనుండటం ఆనందకరం" అని అన్నారు. బ్రిటన్ లో ఎంపిక చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ, వారికి ఇండియాలోని 17 ప్రాంతాల్లో ఉన్న టీసీఎస్ కార్యాలయాల్లో శిక్షణ ఇవ్వడమే ఈ స్కీమ్ ఉద్దేశం. ఇది 2020 వరకూ కొనసాగుతుంది. యూకే-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, న్యూటన్-భాభా ఫండ్ సంస్థలు ఇందుకు సహకరించనున్నాయి. గత సంవత్సరం నవంబరులో భారత ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ కలిసిన సందర్భంగా 2016ను 'యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే టీసీఎస్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ మొదలుకానుంది.

  • Loading...

More Telugu News