: ‘షార్’ సమీపంలో అజ్ఞాత వ్యక్తి... అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడిన నేపథ్యంలో దేశానికి చెందిన కీలక స్థావరాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) లోనూ భద్రత పెరిగింది. సీఎస్ఎఫ్ఐ బలగాలు ఈ కేంద్రానికి భద్రత కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పసిగట్టిన బలగాలు ఆందోళనకు గురయ్యాయి. వెనువెంటనే రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లా నవగార్ తాలూకాకు చెందిన మొహిత్రి గ్రామానికి చెందిన కరణ్ గా అతడిని గుర్తించారు. విచారణలో భాగంగా అతడు చెప్పిన సమాధానాలు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉండటంతో సీఎస్ఎఫ్ఐ బలగాలు అతడిని స్థానిక పోలీసులకు అప్పగించాయి.