: ‘గ్రేటర్’ బరిలో టీఆర్ఎస్ కూ షాక్!...15 డివిజన్లలో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, మజ్లిస్ మద్దతు లేనిదే దాదాపు గ్రేటర్ మేయర్ పీఠం దక్కేది కాదు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సత్తా చాటింది. మజ్లిస్ మద్దతు లేకుండానే ఆ పార్టీ గ్రేటర్ మేయర్ పీఠాన్ని అధిరోహించనుంది. ఈ మేరకు స్పష్టమైన మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, రేపు తన అభ్యర్థిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టనుంది. ఇంతటి అఖండ విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో భారీ షాకే తగిలిందట. మొత్తం 150 డివిజన్లలో ఆ పార్టీ పోటీ చేయగా, అత్యధికంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 15 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం విశేషం. మరోవైపు ఎంపిక చేసుకున్న డివిజన్లలోనే పోటీ చేసిన మజ్లిస్ కూ 10 డివిజన్లలో డిపాజిట్లు దక్కలేదు. ఇక ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ కు ఏకంగా 126 స్థానాల్లో కనీస ఓట్లు కూడా రాలేదు. సింగిల్ సీటుతో సరిపెట్టుకున్న టీడీపీకి 36 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News