: లిఫ్ట్ ఇద్దామని తెలిసిన అమ్మాయిలను ఎక్కించుకుంటే, రూ. 20 లక్షలు కొట్టేశారు!

తనతో పాటు హైదరాబాద్ కు వస్తానని చెప్పిన ఇద్దరు బంధువుల అమ్మాయిలకు సాయం చేద్దామన్న ఉద్దేశంతో కారు ఎక్కించుకుంటే, సినిమా ఫక్కీలో రూ. 20 లక్షలను కాజేసిన ఘటన విజయవాడలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి తమ్మారెడ్డి శ్రీనివాస్, సంస్థకు చెందిన రూ. 20 లక్షలను హైదరాబాద్ లో అందించేందుకు బయలుదేరాడు. తనతో పాటు హైదరాబాద్ కు వస్తామని, తోడుగా ఉండాలని చెప్పిన బంధువుల యువతులను కారెక్కించుకుని రైల్వే స్టేషనుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అల్పాహారం నిమిత్తం కారు ఆపి టిఫిన్ చేశాడు. ఆపై రైల్వే స్టేషనుకు వెళ్లి చూడగా డబ్బు కనిపించలేదు. దీంతో అవాక్కయిన శ్రీనివాస్ సూర్యారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులోని అమ్మాయిలపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో విచారించే సరికి తామే డబ్బు కాజేశామని, ఆపై భయపడి బందరు కాల్వలో పడేశామని వారు తెలిపారు. దీంతో బందరు కాల్వలో వెతికి డబ్బు సంచీని గుర్తించిన పోలీసులు దాన్ని బాధితుడికి అందించారు. యువతులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు.

More Telugu News