: ఐపీఎల్ మహిమ!... కూలీ కొడుకు కరోడ్ పతి అయ్యాడు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరిట తొమ్మిదేళ్ల క్రితం రంగ ప్రవేశం చేసిన పొట్టి క్రికెట్ పండుగ... అనామకులను క్షణాల్లో స్టార్లను చేసేస్తోంది. గల్లీ క్రికెట్ లో ఆడిన వారిని కూడా వరల్డ్ క్రికెట్ లోకి లాగేస్తోంది. అంతేకాదు, దినసరి కూలీల ఇంట పుట్టిన ఆణిముత్యాలను క్షణాల్లో కోటీశ్వరులను చేసేస్తోంది. అలాంటి ఓ అరుదైన ఘటన నిన్నటి ఐపీఎల్ వేలంలో చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో దినసరి కూలీ కింద కార్మికుడిగా పనిచేస్తున్న ఓ సాధారణ వ్యక్తి కొడుకు కరోడ్ పతి అయ్యాడు. వివరాల్లోకెళితే... రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న భరత్ సింగ్... తన కొడుకు నాథూ సింగ్ లోని ప్రతిభను గమనించాడు. కొడుకును ప్రోత్సహించాడు. తండ్రి ఇచ్చిన అరకొర ప్రోత్సాహంతోనే నాథూ సింగ్ ఆడిన అతి కొద్ది మ్యాచ్ లలోనే సత్తా చాటాడు. నాథూ సింగ్ బంతి తీసుకున్నాడంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ బెంబేలెత్తాల్సిందే. ఎందుకంటే, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన పాక్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్, ఆసీస్ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ తరహాలో నాథూ సింగ్ కూడా గంటకు 160 మైళ్ల వేగంతో బంతులను వేస్తాడు. ఇప్పటిదాకా దేశవాళీలో 11 టీ20 మ్యాచ్ లు మాత్రమే నాథూ సింగ్ ఆడాడు. ఈ అతి స్వల్ప కాలంలోనే అతడిలోని ప్రతిభను భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రావిడ్ గుర్తించాడు. ఇంకేముంది, నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో నాథూ సింగ్ ను ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా రూ.3.2 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. అంత ధర దక్కడంపై నాథూ సింగే ఆశ్చర్యానికి గురయ్యాడు. ‘‘మా కుటుంబ ఆర్థిక కష్టాలు తీరినట్లే. ఈ డబ్బుతో ముందుగా నా తల్లిదండ్రులకు ఓ పెద్ద ఇంటిని కొనుగోలు చేస్తాను’’ అని నాథూ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఇతడు కోటీశ్వరుడైన వేళ, అతడి తండ్రి భరత్ సింగ్ తాను పనిచేసే కంపెనీలో ప్యాకెట్లు లోడింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడట. ఎవరి ద్వారానో విషయం తెలుసుకున్న భరత్ సింగ్ ‘‘ఎట్టకేలకు నా కొడుకు ప్రతిభకు ప్రతిఫలం దక్కింది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.

More Telugu News