: సీట్లు తగ్గినా ఓట్లు బాగానే వచ్చాయి... బాధ్యత కలిగిన విపక్షంగా వ్యవహరిస్తామంటున్న కిషన్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి ఘోర పరాభవం కలిగింది. గతంలో 45 డివిజన్లలో విజయం సాధించిన టీడీపీ తాజా ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క డివిజన్ కు మాత్రమే పరిమితమైంది. ఇక ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని మరీ బరిలోకి దిగిన బీజేపీ గతంతో పోలిస్తే ఓ సీటు కోల్పోయి నాలుగు డివిజన్లకే పరిమితమైంది. వెరసి ఈ రెండు పార్టీల కూటమికి గతంలో 50 డివిజన్లుంటే, తాజాగా ఆ రెండు పార్టీల బలం 5కు పడిపోయింది.
ఈ సందర్భంగా ఆత్మావలోకనం చేసుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పిన ఆయన తాజా ఎన్నికల్లో సీట్లు తగ్గినా తమకు 18 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.