: పెను వివాదంగా టాంజానియా విద్యార్థినిపై దాడి... బెంగళూరుకు విదేశాంగ శాఖ అధికారులు, దౌత్య సిబ్బంది
కర్ణాటక రాజధాని బెంగళూరులో మొన్న ఆదివారం టాంజానియా విద్యార్థినిపై జరిగిన దాడి పెద్ద వివాదంగానే మారేలా ఉంది. ఎవరో కారుతో ఢీకొట్టి వ్యక్తి మరణానికి కారణమైతే, స్నేహితులతో కలిసి అటుగా వెళుతున్న టాంజానియా విద్యార్థినిపై బెంగళూరువాసులు దారుణానికి తెగబడ్డారు. యువతి అనే సానుభూతి కూడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆమెపై దాడి చేయడమే కాక నడిరోడ్డుపై వివస్త్రను చేసి నగ్నంగా పరుగులు పెట్టించారు.
ఈ ఘటనపై టాంజానియా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బెంగళూరువాసుల దారుణ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ కు అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో పాటు టాంజానియా, మరిన్ని దేశాల దౌత్యాధికారుల బృందం నేడు బెంగళూరుకు వెళ్లనుంది. ఘటనపై సమగ్ర వివరాలు సేకరించడమే కాక నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపైనా వారు బెంగళూరు పోలీసులతో చర్చించనుంది.