: ‘ఎక్స్ అఫీషియో’ జీవో రద్దు... ఆర్డినెన్స్ జారీ: హైకోర్టు మొట్టికాయతో టీ సర్కారు కీలక అడుగు!

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిన్న రాత్రి వ్యూహాత్మక అడుగు వేసింది. ఏపీ పునర్విభజన చట్టానికి సవరణల పేరిట పలు అంశాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్న కేసీఆర్ సర్కారుపై నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విభజన చట్టాన్ని చదువుకుని రావాలంటూ నిన్న హైకోర్టు ధర్మాసనం తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కు తలంటింది. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తనకు అనుకూలంగా మలచుకున్న ‘ఎక్స్ అఫీషియో’ జీవోను రద్దు చేసిన ప్రభుత్వం, ఆ వెంటనే దానిపై ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆగమేఘాలపై, అది కూడా గంటల వ్యవధిలో జరిగిపోయింది. మార్చేసిన జీవోలోని అంశాలతోనే ఆర్డినెన్స్ కు రూపకల్పన చేసిన ప్రభుత్వం అందుబాటులో ఉన్న మంత్రుల వద్దకు సదరు ఫైలును పంపి ‘సర్క్యులేషన్’లోనే కేబినెట్ ఆమోదం తీసుకుంది. వెనువెంటనే దానిని పట్టుకుని అడ్వొకేట్ జనరల్, ఇతర అధికారులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వద్దకు పరుగులు పెట్టారు. ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఏజీ వివరించగా, సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ వెనువెంటనే దానిపై సంతకం పెట్టేశారు. దీంతో గ్రేటర్ మేయర్ ఎన్నికలో కీలకం కానున్న ఎమ్మెల్సీలకు ఓటు హక్కుపై టీఆర్ఎస్ ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టయింది.

More Telugu News