: అత్యంత నమ్మకమైన దేశాల్లో ఇండియా టాప్!
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్న దేశాల్లో ఇండియా తొలి స్థానంలో నిలిచింది. రీసెర్చ్ ఏజన్సీ నీల్సన్ ఈ జాబితాను తయారు చేయగా, అత్యంత నమ్మకమైన దేశాల్లో భారత్ టాప్ లో నిలిచింది. గత సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 131 పాయింట్లతో ఉండగా, రెండో స్థానంలో ఫిలిప్పైన్స్ (117) నిలిచింది. ఆపై ఇండొనేషియా (115), థాయ్ ల్యాండ్ (114) పాయింట్లతో నిలిచాయని నీల్సన్ వెల్లడించింది. ఇండియాలో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నప్పటికీ, దాన్నుంచి సులువుగా బయటపడగలమన్న నమ్మకం బలంగా ఉందని పేర్కొంది. భారత్ లో నెలకొన్న అనిశ్చితి విదేశాల్లో నెలకొన్న పరిస్థితుల వల్లేనని నీల్సన్ అభిప్రాయపడింది. కాగా, ఈ త్రైమాసికంలో యూకే, జర్మనీ, అమెరికా, జపాన్ వంటి దేశాల కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పడిపోవడం గమనార్హం. యూకే ఇండెక్స్ 101 పాయింట్లు ఉండగా, అమెరికా 100, జర్మనీ 98, జపాన్ 79 పాయింట్ల వద్ద ఉన్నాయని నీల్సన్ పేర్కొంది.