: ఓటేసేందుకు రాని ఓటర్... మూడు గంటల్లో పది శాతం కూడా దాటని పోలింగ్!
గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఇంకా ముందుకు రాలేదు. చాలా చోట్ల పోలింగ్ బూత్ లు ఖాళీగా కనిపిస్తున్నాయి. పోలింగ్ 7 గంటలకు ప్రారంభం కాగా, 9 గంటల వరకూ 6.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం 9:45 గంటల వరకూ 8 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. బాగ్ అంబర్ పేట్, సికింద్రాబాద్, కూకట్ పల్లి ప్రాంతాల్లోని బూత్ లు మాత్రమే కాస్తంత ఓటర్లతో కళకళలాడుతున్నాయని సమాచారం. కాగా, ఓటర్లు బయటకు రావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పార్టీలను పక్కనబెట్టి ప్రతిఒక్కరూ ఓటేసేందుకు రావాలని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ కోరారు. ఓటేసేందుకు వచ్చిన నేతలంతా ప్రజలు తరలి రావాలని పిలుపునిస్తుండటం గమనార్హం. తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ ఓటేసేందుకు రాబోమని హస్తినాపురం ఓటర్లు స్పష్టం చేశారు. హస్తినాపురం ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బైఠాయించారు.