: తుని ఘటన నిందితులను వదలం: తూ.గో.జిల్లా ఎస్పీ
తూర్పుగోదావరి జిల్లా తునిలో నిన్న జరిగిన విధ్వంసానికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ప్రకటించారు. కాపు ఐక్య గర్జన సభ అనంతరం రైల్ రోకో, రాస్తారోకోకు దిగిన ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. రత్నాచల్ ఎక్స్ ప్రెస్, తుని రూరల్ పోలీస్ స్టేషన్, వాహనాల దగ్ధంకు పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని అన్నారు. ఈ విధ్వంసంలో రైల్వే, పోలీస్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొత్తం 35 కేసులు నమోదు చేశామని, ఆధారాలు సేకరిస్తున్నామని రవిప్రకాశ్ చెప్పారు. ఆందోళన కారుల దాడిలో 12 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి గాయాలయ్యాయన్నారు.