: విధ్వంసం బాధ్యత టీడీపీదేనండీ!: ముద్రగడ
తూర్పుగోదావరి జిల్లాలో నిన్న చోటు చేసుకున్న సంఘటనలకు బాధ్యత వహించాల్సింది టీడీపీయేనని కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. నిన్న జరిగిన సంఘటనల గురించి ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాపుల సభను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రపన్నిందని అన్నారు. అందుకే తమకు అనుమతులివ్వలేదని ఆక్షేపించారు. చివరికి గూండాలను పంపి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాపులను అణగదొక్కేందుకు టీడీపీ కుట్రపన్నిందని ఆయన విమర్శించారు. కాపుల ప్రయోజనాలు నెరవేర్చాలన్న ఆలోచన టీడీపీకి లేదని ఆయన అన్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని తాను తాకట్టుపెట్టలేదని, అలాంటి మనిషిని కాదని ఆయన చెప్పారు. డబ్బుకి అమ్ముడుపోయామని చాలా మంది అంటున్నారని; తాను డబ్బు, పదవులకు అమ్ముడుపోయే మనిషిని కాదని ఆయన వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.