: చంద్రబాబు ఇంత 'చీప్' సీఎం అనుకోలేదు: జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పదే పదే తప్పులు చేస్తూ, ఓ 'చీప్ సీఎం'గా మారిపోయారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, బాబు చేసే తప్పులను వేరేవాళ్లపై రుద్దేందుకు ఏ స్థాయికైనా దిగజారేందుకు వెనుకంజ వేయడం లేదని ఆరోపించారు. నిన్నటి కాపు గర్జన సభను ప్రస్తావిస్తూ, చంద్రబాబు సిగ్గు పడాలని ఎద్దేవా చేశారు. ఆయన కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని, తమ పార్టీ పాత్ర ఉందని పచ్చి అపద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తలాతోకా లేని మాటలు చెబుతున్న ఆయన ఓ రాజకీయ నీచుడిలా ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. పులివెందులలో ఇటువంటివి జరిగినా ఫర్వాలేదని బాబు వ్యాఖ్యానించాడని, ఆయన మానసిక స్థితి ఎలావుందో ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. ఆయన మీడియా సమావేశం చూసి తనకు ఆశ్చర్యం వేసిందని, కాపులకు తానేం చేస్తానో, ఎప్పుడు చేస్తానో అన్న మాట మాత్రం రానీయకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడని జగన్ విమర్శించారు. తన ప్రభుత్వం తప్పు బయటకు రాకుండా చూసుకునేందుకు, నేరాన్ని అవతలి వైపునకు రుద్దడం ఆయనకు దినచర్యగా మారిందని అన్నారు. "అయ్యా చంద్రబాబూ, ఇది నీ మ్యానిఫెస్టోనే కదా? ఎన్నికలకు ముందు ఈ మ్యానిఫెస్టోలో, కాపులకు సంబంధించిన అంశంమీద, ఓ పేజీలో తాను అన్న మాటలు... 'కాపులకు రిజర్వేషన్ల విషయమై ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలోనే బీసీలకు నష్టం జరుగకుండా సమస్యను పరిష్కరిస్తాం' అన్న మాటలు ఉన్నాయి. 'ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తాం...' ఆయనన్న మాటలే ఇవి" అంటూ మ్యానిఫెస్టోను చూపారు. తానన్న మాటలనే మరచి కాపు వర్గం ఆగ్రహానికి గురైన చంద్రబాబు, గద్దెదిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జగన్ జోస్యం చెప్పారు.

More Telugu News