: సాయంత్రం వరకే డెడ్ లైన్... జీవో రాకుంటే ఆమరణ దీక్షే: సర్కారుకు ముద్రగడ అల్టిమేటం

‘‘సాయంత్రం వరకే డెడ్ లైన్... సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సిందే. లేదంటే సాయంత్రం నుంచే ఆమరణ దీక్షకు దిగుతా’’ అని కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్పారు. ఈ మేరకు నిన్న సాయంత్రమే ఆయన ఏపీ ప్రభుత్వానికి దాదాపుగా అల్టిమేటం జారీ చేశారు. నిన్న తూర్పు గోదావరి జిల్లా తునిలోని కొబ్బరి తోటల్లో జరిగిన ‘కాపు ఐక్య గర్జన’కు ఆ సామాజిక వర్గం పోటెత్తింది. లక్షలాదిగా కాపులు తరలివచ్చారు. జన సందోహాన్ని చూసిన ముద్రగడ ఉద్వేగంగా మాట్లాడారు. ఈ క్రమంలో 15 నిమిషాలు మాట్లాడారో, లేదో... ఆయన నోటి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ‘మీటింగులతో పనిలేదు, రోడ్ల మీదకెళదాం పదండి’ అంటూ ఆయన చేసిన ప్రకటనకు కాపులు వెల్లువలా కదిలారు. జాతీయ రహదారిపైకే కాక సమీపంలోని రైల్వే లైనుపైకి క్షణాల్లో వేలాది మంది కాపులు చేరారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనాలపైనా ప్రతాపం చూపారు. ఈ క్రమంలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ‘రేపు సాయంత్రం వరకూ వేచి చూస్తాం. ఆలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. నిర్దేశించిన సమయంలోగా జీవో విడుదల కాకుంటే ఆమరణ దీక్షకు దిగుతా’’ అని ఆయన ప్రకటించారు. మరి నేడు ప్రభుత్వం ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News