: ఇక అటో ఇటో తేల్చుకుందాం!: ‘కాపు’ నేత ముద్రగడ పద్మనాభం

రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ జాతి ఎంతో నష్టపోతోందని.. ఈ ఉద్యమాన్ని ఆపవద్దంటూ తన కెంతో మంది ఫోన్లు చేస్తున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సదస్సు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యల ద్వారా అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోను అమలు చేయాలని, కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలంలో కాపు, బలిజ, తెలగ కులస్తులు రిజర్వేషన్లు అనుభవించారని అన్నారు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నంబరు 30 అమలు కాలేదన్నారు. చంద్రబాబు మాత్రం దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయించి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారని, దీనివల్ల ఆ జీవో అమల్లోకి రాకుండా పోయిందని ముద్రగడ మండిపడ్డారు. కాపులకు ఎంతో చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడని.. మరి, కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేకపోతున్నారని, కోర్టులో పిటిషన్ వేసి ఎందుకు అడ్డుకున్నారని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం ఏమి చేశావంటూ బాబు తనను ప్రశ్నిస్తున్నారని.. తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఉద్యమం చేశానని అన్నారు. అటో ఇటో తేల్చుకుందామని.. జీవో నంబరు 30 వచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని ముద్రగడ అన్నారు.

More Telugu News