: గర్జించనున్న కాపులు, ఒకే వేదికపైకి దాసరి, బొత్స, పొన్నాల, కన్నా, కేశవరావు, పళ్లంరాజు!
కాపులను వెనుకబడిన తరగతుల్లో కలపాలన్న ఏకైక లక్ష్యంతో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తలపెట్టిన 'కాపు గర్జన'కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానుండటం, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వరకూ కాపు శ్రేణులు వస్తారన్న అంచనాలతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పలు రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతలు దాసరి నారాయణరావు, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ఎంఎం పళ్ళంరాజు, కె.కేశవరావు, సి.రామచంద్రయ్య, హరిరామజోగయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు సదస్సుకు రానున్నారని నిర్వాహకులు తెలిపారు.
సదస్సు కోసం 16 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, 3 లక్షల మందికి భోజనాలు సిద్ధం చేశారు. మరోవైపు, ఈ సదస్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సభ అని తెలుగుదేశం వర్గాలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ కాపు క్యాడర్ కూడా సదస్సుకు హాజరయ్యేందుకు బయలుదేరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సదస్సును గురించి ప్రస్తావించకుండా, కాపులకు తాము మేలు చేయాలనుకుంటుంటే, కొందరు పనిగట్టుకుని అనవసర రాజకీయాలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.