: దత్తాత్రేయ పెద్దమనిషని అనుకున్నా: కేసీఆర్
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో అయినా డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తారని దత్తాత్రేయ చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన నిలదీశారు. అంతెందుకు, గత రెండు రోజులుగా మీరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అయినా డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఉందా? అని ఆయన అడిగారు. దత్తాత్రేయ అంటే పెద్దమనిషి అనే గౌరవం ఉండేదని, ఆయన చౌకబారు మాటలతో ఆ గౌరవం పోయిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.