: దమ్ము కొట్టడమే నా ఆరోగ్య రహస్యం: 113 ఏళ్ల బామ్మగారి ఉవాచ
ధూమపానం ఆరోగ్యానికి హానికరం..ఆయుష్షు తగ్గిపోతుంది... రోగాల బారిన పడతాము.. మనం తరచుగా వింటూ ఉండే మాటలివి. కానీ, అవేవీ తనకు వర్తించవని.. ఆరోగ్యంగా, ఆనందంగా, సుదీర్ఘ ఆయుష్షుతో ఉన్నానని త్వరలో 113వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపాలీ బామ్మగారు చెబుతున్నారు. ఇటీవల ఆమెను కలిసిన ఒక మీడియా ప్రతినిధికి వెల్లడించిన విషయాలు..
నేపాల్ రాజధాని ఖాట్మండుకు సమీపంలోని ఒక గ్రామంలో బతులీ లమిచ్ఛానే అనే ఈ వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి సిగిరెట్లు, బీడీలు తాగడం మొదలైంది. రోజుకూ 30 సిగిరెట్లు అవలీలగా కాల్చేస్తానని, ఒక్క సిగిరెట్ తక్కువైనా భరించడం తన వల్ల కాదని బామ్మ చెప్పింది. ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అంటుంటారు..నాకు మాత్రం ఆరోగ్యకరం’ అని బతులీ పేర్కొంది.
ఈ వయస్సులో కూడా ఉత్సాహంగా పనిచేయడం వెనుక రహస్యమేమిటని ఆమెను ప్రశ్నించగా..‘పొగ తాగడం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని’ సమాధానం చెప్పింది. తన కుటుంబం వివరాలను కూడా ఆమె ప్రస్తావించింది. తన భర్త ఉపాధి కోసమని ఎనభై ఏండ్ల క్రితం భారత్ కు వలస వెళ్లాడని, తనకు నలుగురు పిల్లలని.. అందులో ముగ్గురు చనిపోయి చాలా కాలమైందని చెప్పింది. ప్రస్తుతం 80 ఏళ్ల కొడుకువద్ద తాను ఉంటున్నట్లు బతులీ వివరించింది.