: దేశ రాజధానిలో పట్టాలెక్కనున్న డ్రైవర్ రహిత రైళ్లు... పరీక్షించిన ఢిల్లీ మెట్రో

ఢిల్లీలోని ఫేజ్ 3 రెండో కారిడార్ లో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు నడవనున్నాయి. ఇందుకోసం నగరంలోని ఉత్తర ప్రాంతంలో నెల రోజుల నుంచి డ్రైవర్ రహిత రైళ్లను ఢిల్లీ మెట్రో పరీక్షిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను దిగుమతి చేసుకోగా, అవి ఢిల్లీలోని ముకుంద్ పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు ఫిబ్రవరి నాటికి వచ్చే అవకాశం ఉంది. సిగ్నలింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఫిటింగ్స్ తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షిస్తున్నామని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రతినిధి అనుజ్ దయాల్ చెప్పారు. ఈ రైళ్లను దక్షిణ కొరియాలో తయారు చేయగా, భారత్ లో ఇలాంటి నమూనా రైలునే తయారు చేశారని తెలిపారు. బెంగళూరులో తయారు చేసిన ఓ రైలు గత డిసెంబర్ లో ఢిల్లీకి చేరుకుందని, ఫేజ్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ రైళ్ల ప్రాథమిక పరీక్షలో సిబ్బంది ఉంటారని, పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతామని వివరించారు. డ్రైవర్ రహిత రైళ్లలో 20 కోచ్ లను మాత్రమే దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నామని, మిగిలిన 366 కోచ్ లను బెంగళూరులో తయారు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News