: ఇక ఏపీలో ఇంట్లోనే కొత్త సినిమాలు!
కొత్త సినిమా రిలీజైతే, మంచి క్వాలిటీ, సరౌండ్ సౌండ్ లతో ఇంట్లోనే కూర్చుని చూసే సదుపాయం ఆంధ్రప్రదేశ్ వాసులకు దగ్గర కానుంది. 15 మెగాబైట్ల నుంచి 1 టెరాబైట్ వరకూ ఇంటర్నెట్ స్పీడ్ ను అందించే ఫైబర్ గ్రిడ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరులోగా అందుబాటులోకి రానుండటమే ఇందుకు కారణం. తొలుత జూన్ నెలాఖరులోగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సదుపాయం లభిస్తుంది. ఆపై మిగతా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సదస్సు జరుగగా, పనులు పర్యవేక్షిస్తున్న పలు విభాగాల ప్రతినిధులు హాజరై గ్రిడ్ పనులు ఎంతవరకూ వచ్చాయన్న విషయమై చర్చించారు. గ్రిడ్ నిర్మాణం పూర్తయ్యాక, గ్రామస్థాయిలో సేవలందించే ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లను భాగం చేస్తామని తెలిపారు.
ఇప్పటివరకూ 4,500 కి.మీ పొడవైన ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ నిర్మాణం పూర్తయిందని, మరో 19,500 కి.మీ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వుందని ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ సీఈఓ కోగంటి సాంబశివరావు తెలిపారు. గ్రిడ్ ద్వారా టెలిఫోన్ సేవలు అందుకుంటే ఔట్ గోయింగ్ చార్జీలుండవని, ప్రత్యేక చెల్లింపులతో కొత్త చిత్రాలను ఇంట్లో నుంచే వీక్షించవచ్చని తెలిపారు. గ్రిడ్ కు సహకరించేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ తదితర ఐటీ కంపెనీలు హామీ ఇచ్చాయని వివరించారు. సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేసిన వారు రూ. 1,500 చెల్లించి, బాక్స్ లేనివారు రూ. 2,500 చెల్లించి ఈ సేవలను అందుకోవచ్చని పేర్కొన్నారు.