: భార్యను మెప్పించేందుకు ఐదు వంటగది చిట్కాలు!
ఉదయాన్నే భార్యకు ప్రేమతో కప్పు కాఫీ కలిపిచ్చినా, బయటి నుంచి వచ్చే సరికి పలహారం సిద్ధం చేసినా, ఆ భర్తపై భార్యకున్న ప్రేమ, అనురాగం మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామికి వంటగదిలో అందించే ఆ చిరు సాయం ఇద్దరి మధ్యా మరింత బంధానికి మార్గంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కష్టపడి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఐదు చిట్కాలు వంటబట్టించుకుంటే చాలు! * కాఫీ, టీ తయారు: పాలు స్టౌ మీద పెట్టి వాటిని వేడి చేసి కాఫీపొడి, పంచదార కలిపితే వేడివేడి కాఫీ తయారవుతుంది. కాఫీ లేదంటే టీ... తయారు చేయడం సులభమే. ఎటొచ్చీ ఎంత పంచదార, పొడి వేయాలన్నదానిపై అవగాహన పెంచుకుంటే చాలు * కిచన్ లో వాడే పరికరాలు, ఏ సామాను ఎక్కడ ఉంటుందన్న విషయమై కొంత తెలుసుకుని ఉంటే మంచిది. భార్య వంట చేస్తున్నప్పుడు అవసరానికి ఏదో ఒకటి అందించినా, ఇద్దరి మధ్యా అనురాగం పెరుగుతుంది. * ఏదైనా మీ స్పెషల్ వంట: సతీమణి ఎన్నడూ చేయని ఓ వంటకం గురించి కాస్తంత రీసెర్చ్ చేసి, అది ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. దీంతో జీవిత భాగస్వామిని ఎంతో ఇంప్రెస్ చేయవచ్చు. అయితే, చేసిన వంటకాన్ని భార్యకు పెట్టే ముందు రుచి చూడాలి సుమా! ఒకటికి రెండు సార్లు వండితే, ఏ వంటకమైనా రుచిగానే వస్తుంది. * వడ్డించడమూ ముఖ్యమే: ఏదైనా ఓ స్పెషల్ వంటను చేసిన తరువాత, దానికి మరింత అందాన్నిచ్చేలా అలంకరణ... అంటే గార్నిష్ చేయడంలోనూ కాస్తంత ప్రత్యేకత చూపాలి. ఇక ఏ రాత్రయితే డిన్నర్ సమయంలో మీదైన ఓ స్పెషల్ వంట ఉంటే, ఆ రాత్రి మరింత మధురానుభూతులను మిగుల్చుకోవచ్చు. * భార్యకు సహాయం: వంటలో ఏ మాత్రం కాస్తంత ప్రవేశమున్నా భార్యకు కిచన్ లో ఎంతో సహాయం చేయవచ్చు. కూరగాయలు తరగడం నుంచి బియ్యం కడగడం వరకూ ఏ పని చేసి పెట్టినా, ఆ కాస్త సమయం మరింత ముద్దు, ముచ్చట్లకు ఆదా చేసుకున్నట్టే కదా!