: రెండు గంటల్లో సీన్ రివర్స్... భారీ నష్టాల దిశగా మార్కెట్, తగ్గిన బంగారం ధర
భారీ నష్టాల నుంచి రికవరీ వచ్చి లాభాలు నమోదయ్యాయన్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల ఆనందం రెండు గంటల్లోనే మాయమైంది. ఈ ఉదయం 9:30 గంటల సమయంలో దాదాపు 200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 100 పాయింట్లకు పైగా నష్టంలో సాగుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 23,950, నిఫ్టీ 7,279 పాయింట్ల వద్ద ఉన్నాయి. నిఫ్టీకి 7,300 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతు లభించకుంటే సమీప భవిష్యత్తులో 7 వేల కన్నా దిగువకు పడిపోయే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆరంభంలో లాభాల్లో నిలిచిన ఆసియా మార్కెట్లు క్లోజింగ్ సమయానికి నష్టాల్లోకి దిగజారడం భారత మార్కెట్ పైనా ప్రభావం చూపిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక బులియన్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోలిస్తే 500 పాయింట్లకు పైగా పెరిగిన పది గ్రాముల బంగారం ధర మధ్యాహ్నం 12 గంటల సమయంలో 107 రూపాయలు తగ్గి 26,452కు చేరింది.