: పదవీ విరమణకు ముందు భారత ఐటీ కంపెనీలపై బాంబేసిన విప్రో సీఈఓ


ఇండియలోని మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా గుర్తింపున్న విప్రోలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా త్వరలో పదవీ విరమణ చేయనున్న టీకే కురియన్, భారత ఐటీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ కంపెనీల ముందు పెను తుపాను రూపంలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయని ఆయన అన్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఆయన, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, "సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కస్టమర్లు సైతం తమకు అందుతున్న సేవల్లో మార్పులను కోరుకుంటున్నారు. ఇది ఐటీ కంపెనీల ముందున్న పెను సవాలు. అన్ని వైపుల నుంచి ఐటీ సేవలపై ఒత్తిడి పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారకుంటే ఏం జరుగుతుందన్న దానికి ఐబీఎం పెద్ద ఉదాహరణ. అయితే, ఈ సంప్రదాయ ఐటీ సంస్థల్లో ఈ మార్పు అంత సులభం కాదు" అని కురియన్ వ్యాఖ్యానించారు. "మూడేళ్ల క్రితం 'క్లౌడ్' అన్న పదమే వినిపించలేదు. ఇప్పుడు ప్రపంచమంతా క్లౌడ్ టెక్నాలజీపై ఆధారపడుతోంది. ఐటీ కంపెనీల ప్రధాన పనుల్లో ఒకటైన అప్లికేషన్ డెవలప్ మెంట్, నిర్వహణను క్లౌడ్ ఇప్పటికే అధిగమించేసింది. వారసత్వ అప్లికేషన్లు వాడుతున్నంత కాలం పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ప్రజల ఆలోచనా విధానం మారుతుండగా, క్లౌడ్ ఆధారిత అప్లికేషన్స్ వాడకం శరవేగంగా పెరుగుతోంది. దీని వల్ల ఐటీ సంస్థల ఆదాయం ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని వివరించారు. ఐటీ కంపెనీలు మారేందుకు ఐదు నుంచి ఏడేళ్ల సమయం ఉందని భావిస్తున్నానని, ఈ లోగా మారకుంటే కంపెనీ మూసివేసుకోవాల్సిందేనని కురియన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News