: మార్చిలోగా మరో రూ. 15 వేల పన్ను మిగుల్చుకోవాలంటే..!


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండున్నర నెలల్లో ముగియనుంది. పన్ను పరిధిలో ఉన్న ఉద్యోగులు, ప్రజలు ఇప్పటికే ముందస్తు రిటర్న్ లను దాఖలు చేసివుంటారు. ఈ రెండున్నర నెలల వ్యవధిలో మరో రూ. 15 వేల పన్ను మిగుల్చుకునే అవకాశం గురించి మీకు తెలుసా? ప్రస్తుత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రకటించి, ఆపై అమల్లోకి వచ్చిన న్యూ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ నిబంధనల కింద ఆదా చేసుకునే పన్నుకు అదనంగా సెక్షన్ 80సీసీడీ కింద మరో రూ. 15 వేలను మిగుల్చుకోవచ్చు. అందుకోసం ఎన్పీఎస్ లో రూ. 50 వేల రూపాయలను పెట్టబడిగా పెట్టాల్సి వుంటుంది. పెన్షన్ స్కీములో రూ. 50 వేలను పెట్టుబడిగా పెట్టడం ద్వారా 30 శాతం పన్ను పరిధిలో ఉన్నవారికి రూ. 15 వేలు, 20 శాతం పన్ను పరిధిలో ఉన్నవారికి రూ. 10 వేలు, 10 శాతం పన్ను పరిధిలోని వారికి రూ. 5 వేలు మిగులుతుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తున్న స్వచ్ఛంద పెన్షన్ స్కీముగా అందుబాటులో ఉన్న ఈ పథకంలో పెట్టే పెట్టుబడులను, 60 సంవత్సరాల వయసు దాటిన తరువాత వెనక్కు తీసుకోవచ్చు. పదవీ విరమణ తరువాత ఆదాయాన్ని అందించే పథకంగా దీన్ని తీర్చిదిద్దారని వెల్త్ అడ్వయిజర్ సంస్థ 'ప్లాన్ ఎహెడ్' వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ తెలిపారు. ఈ పథకం మరింత పన్ను ఆదాకు సరైనదని ఆయన వివరించారు. కాగా, ఈ ఎన్పీఎస్ స్కీములో భాగంగా ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డెట్, ఈక్విటీల్లో నగదును పెట్టుబడిగా పెట్టాలని కూడా ముందే కోరవచ్చు. ఈక్విటీల్లో 50 శాతాన్ని మించకుండా పెట్టుబడులను నిర్వహించమని కోరే అవకాశముంది. అయితే, పీపీఎఫ్ రిటర్నుల మాదిరిగా ఎన్పీఎస్ స్కీముల్లో కచ్ఛితమైన ఆదాయం ఉండదు. ఎందుకంటే, ఇవి మార్కెట్ తో సంబంధాన్ని కలిగివుంటాయి కాబట్టి.

  • Loading...

More Telugu News