: ధాటిగా ఆడిన ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్...విజయం దిశగా ఆసీస్
ఆస్ట్రేలియా సిరీస్ లో భారత్ కు కష్టాలు తప్పడం లేదు. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఆడుతోంది. 309 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కు ఆరోన్ ఫించ్ (71), షాన్ మార్ష్ (71) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడడంతో ఆసీస్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. స్కోరు బోర్డును ఉరకలెత్తించే క్రమంలో జడేజా బౌలింగ్ లో లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ కు యత్నించిన ఫించ్ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రహానే మెరుపు వేగంతో చేసిన అద్భుతమైన డైవ్ కు బలయ్యాడు. అనంతరం స్టీవ్ స్మిత్ ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ షాన్ మార్ష్ ను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో స్మిత్ (44) కు, బెయిలీ (36) జత కలిశాడు. వీరిద్దరూ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో 40 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్లో కోల్పోయి 237 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు.