: సింగిల్ పరుగు మాత్రమే తగ్గింది!... రెండో వన్డేలో ఆసీస్ లక్ష్యం 309 పరుగులు!
ఆసీస్ పర్యటనలో భాగంగా రెండో వన్డేలోనూ భారత్ బ్యాటు ఝుళిపించింది. బ్రిస్బేన్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన తన ఇన్నింగ్స్ లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. మరికాసేపట్లో ఆస్ట్రేలియా 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తొలి వన్డే మాదిరిగానే రెండో వన్డేలోనూ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మూడో ఓవర్ లోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (6) వెనుదిరగగా, తొలి వన్డేలో మాదిరిగానే రోహిత్ శర్మ రెండో వన్డేలోనూ చెలరేగిపోయాడు. మొత్తం 127 బంతులను ఎదుర్కొన్న అతడు మూడు సిక్స్ లు, 11 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (59), అజింక్యా రెహానే (89) రాణించారు. కెప్టెన్ ధోనీ (11), కొత్త కుర్రాడు మనీష్ పాండే (6), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్ అశ్విన్ (1) పెద్దగా రాణించలేకపోయారు. ముగ్గురు కీలక బ్యాట్స్ మెన్ రాణించడంతో రెండో వన్డేలోనూ భారత్ తన స్కోరును ట్రిబుల్ సెంచరీ దాటించింది. తొలి వన్డేలోనూ రోహిత్ (171) వీర విహారంతో భారత స్కోరు 309 పరుగులకు చేరింది. తాజాగా మొన్నటి స్కోరు కంటే కేవలం ఒకే ఒక్క పరుగు తక్కువగా భారత్ 308 పరుగులు చేసింది.