: 'ఈ-వాహన బీమా' గురించి తెలుసా? ఇన్స్యూరెన్స్ కాగితాలు లేకుండానే కారు, బైక్ లతో రోడ్డెక్కచ్చు!
ఇకపై ఎలాంటి వాహన బీమా కాగితాలు లేకుండా మీ కారు లేదా బైక్ ను రోడ్డెక్కించేయవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా, అధునాతన టెక్నాలజీ వాడకాన్ని విస్తృతం చేస్తూ, ఐఆర్డీయే (ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) డిజిటల్ వాహన బీమా విధానాన్ని 'ఈ-వాహన్ బీమా' పేరిట అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం తొలుత తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి రావడం విశేషం. మిగతా రాష్ట్రాల్లో త్వరలోనే 'ఈ-వాహన బీమా' అమల్లోకి రానుంది. ఈ విధానంలో...
* వాహన బీమా డిజిటల్ రూపంలో ఉంటుంది. దానికి సంబంధించిన 'క్యూఆర్' (క్విక్ రెస్పాన్స్) కోడ్ వెంట ఉంచుకుంటే చాలు.
* పోలీసులు తనిఖీకి ఆపినప్పుడు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే, బీమా సమాచారం మొత్తం తెలిసిపోతుంది.
* డిసెంబర్ 1 నుంచి తెలంగాణలో ఈ వాహన బీమా పాలసీలను విక్రయిస్తున్నారు.
* ఈ విధానంలో మోటారు వాహన బీమా మోసాలు గణనీయంగా తగ్గిపోతాయి.
* మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, థర్డ్ పార్టీ బీమా లేకుండా వాహనం నడిపితే శిక్షార్హులు
* డిజిటల్ బీమా పాలసీని స్మార్ట్ ఫోన్ల ద్వారా చదువుకోవచ్చు.
* పాలసీదారుడికి ఈ-మెయిల్ సౌకర్యం లేకుంటే, ఎస్ఎంఎస్ ద్వారా వివరాలను బీమా కంపెనీ పంపుతుంది.
* దీని ద్వారా ప్రాసెసింగ్ చార్జీలు వంటివి కూడా తగ్గుతాయి.
* బీమా కంపెనీలకు సైతం నిర్వహణా వ్యయం తగ్గుతుంది.