: తనపై కేసు రద్దు చేయాలంటూ కోర్టులో నటుడు శింబు పిటిషన్
తమిళ నటుడు శింబు బీప్ సాంగ్ వివాదం నుంచి కొద్దికొద్దిగా బయటపడుతున్నాడు. ఇప్పటికే ఆయనకు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిలు ఇవ్వగా, ఇప్పుడు తనపై చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ ను దాఖలు చేశాడు. ఒకే నేరానికి ఒకటికి మించిన కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఇంతకుముందే తీర్పు ఇచ్చిందని, ఆ విధంగా బీప్ సాంగ్ అనే ఒక్క నేరానికి తనపై ఒక్క కేసు మాత్రమే నమోదు చేయాలని పిటిషన్ లో శింబు పేర్కొన్నాడు. కొవై పోలీసులు ఇంతకుముందే తనపై కేసు నమోదు చేశారని, అందువల్ల నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
ఈ పిటిషన్ పై న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య విచారణ జరపగా, చెన్నై నేరపరిశోధనా విభాగం న్యాయవాది కూడా హాజరై వాదించారు. అయితే శింబు తరపు న్యాయవాది వేరే కోర్టుకు హాజరవడం వల్ల విచారణ వాయిదా పడింది. మరోవైపు బీప్ సాంగ్ కేసులో కొవై రేస్ కోర్స్ పోలీసుల ఎదుట ఈ నెల 11న హాజరుకావాల్సిన శింబు ఆ తేదీని హైకోర్టు ద్వారా ఈ నెల 29కి గడువు పొడిగించుకున్నారు.