: ప్రయాణికులకు షాకిచ్చిన ‘చెర్రీ’ ఫ్లైట్!...చివరి నిమిషంలో సర్వీసును రద్దు చేసిన ట్రూజెట్
టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ భాగస్వామిగా ఉన్న ట్రూజెట్ ఎయిర్ లైన్స్ నేటి ఉదయం ప్రయాణికులకు షాకిచ్చింది. చివరి క్షణంలో సర్వీసును రద్దు చేస్తూ ఆ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఎయిర్ పోర్టులోనే మొత్తం 70 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
హైదరాబాదు నుంచి తిరుపతి వెళ్లేందుకు ట్రూజెట్ ఎయిర్ లైన్స్ విమానం టికెట్లు కొన్న ప్రయాణికులు నేటి ఉదయం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. సరిగ్గా బయలుదేరడానికి కాస్తంత ముందుగా సర్వీసును రద్దు చేస్తున్నట్లు ట్రూజెట్ అధికారులు ప్రకటించారు. చివరి నిమిషంలో ఇదేం పద్ధతంటూ ఆ ప్రకటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సాంకేతిక సమస్య కారణంగానే సర్వీసును రద్దు చేసినట్లు పేర్కొన్న ట్రూజెట్ చేసేదేమీ లేదని తేల్చిచెప్పింది.