: బెల్టు బాంబు ముష్కరులు ఐఎస్ మిలిటెంట్లే!...బాగ్దాద్ దాడుల్లో 48 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో నడుములకు బెల్టు బాంబులు కట్టుకుని రంగంలోకి దిగిన ముష్కరులు ఐఎస్ తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లేనట. ఈ మేరకు ఆ సంస్థ ఉగ్రవాదులు నిన్న రాత్రే ప్రకటించుకుంది. బాగ్దాద్ లోని ఓ షాపింగ్ మాల్ బయట తొలుత కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు ఏడుగురిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెల్టు బాంబులతో షాపింగ్ మాల్ లోకి చొరబడ్డ ముష్కరులు మాల్ లోని ప్రజలను బందీలుగా పట్టుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి భద్రతా బలగాలు చేరుకోవడంతో విచక్షణారహితంగా కాల్పులకు దిగడంతో పాటు తమ నడుములకు కట్టుకున్న బెల్టు బాంబులను పేల్చేసుకుని 18 మందిని పొట్టనబెట్టుకున్నారు.
ఆ తర్వాత ఇరాక్ తూర్పు పట్టణం మక్దాదియాలో రెండు బాంబులను పేల్చేసిన ఐఎస్ ముష్కరులు మరో 20 మంది ప్రాణాలు తీశారు. ఈ దాడుల్లో వంద మంది దాకా గాయపడగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. వెరసి ఈ దాడుల్లో మొత్తం 48 మంది దాకా చనిపోయారని ఇరాక్ పోలీసులు తెలిపారు. తమ అధీనంలోని రమదా నగరంలో భద్రతా దళాల భీకర దాడులతో తోక ముడవక తప్పని ఐఎస్ ఉగ్రవాదులు, దానికి ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.