: ‘పఠాన్ కోట్’లో మరిన్ని ఆధారాలు... ఏకే47 మ్యాగజీన్, బైనాక్యులర్, సెల్ ఫోన్ లభ్యం
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో పాకిస్థాన్ ప్రమేయానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నెల 2 తెల్లవారుజామున ఎయిర్ బేస్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు రెండు రోజుల పాటు కాల్పులకు తెగబడ్డారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన గరుడ కమెండోలు ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ క్రమంలో రెండు రోజులకు పైగా ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. కాల్పులు ఆగిపోయిన మరుక్షణం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఎయిర్ బేస్ లో కాలు మోపారు.
బేస్ లో అణువణువూ తనిఖీలు చేస్తున్న అధికారులు నేటి సాయంత్రం పలు కీలక ఆధారాలు సేకరించారు. దాడులు జరిగిన ప్రాంతంలో ఏకే47 మెషీన్ గన్ లో వినియోగించిన ఓ బుల్లెట్ మేగజీన్ తో పాటు ఉగ్రవాదులు వినియోగించినట్లుగా భావిస్తున్న ఓ బైనాక్యులర్, సెల్ ఫోన్ ను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ నుంచే వచ్చిన ఉగ్రవాదులు అక్కడి ఆయుధాలు, పరికరాలనే తమ వెంట తెచ్చుకున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అక్కడ లబించిన ఏకే 47 మేగజీన్, బైనాక్యులర్, సెల్ ఫోన్ లు పాక్ కు సంబంధించిన మూలాలను మరింత స్పష్టం చేయనున్నాయన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.