: దారికొచ్చిన పాక్!...‘పఠాన్ కోట్’పై దర్యాప్తు షురూ, 3 జిల్లాల్లో సోదాలు, పదుల సంఖ్యలో అనుమానితుల అరెస్ట్

ఎట్టకేలకు పాకిస్థాన్ దారికొచ్చింది. నిత్యం భారత్ లో జరుగుతున్న ఉగ్రవాద దాడులన్నీ పాక్ భూభాగంపైనే రూపుదిద్దుకుంటున్నాయని నిఘా వర్గాలు కోడై కూస్తున్నా, నిన్నటిదాకా వినిపించుకోని పాక్... పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడితో ఒక్కసారిగా తన వైఖరి మార్చుకోక తప్పలేదు. ఏడుగురు సైనికుల మరణంతో పాటు రెండు రోజుల పాటు కాల్పుల మోత.. వెరసి పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి పాక్ ను కదలించింది. భారత్ అందించిన కొన్ని ఆధారాలతో పాటు తన వద్ద ఉన్న నిఘా వర్గాల సమాచారంతో ఆ దేశ పోలీసులు రంగంలోకి దిగారు. గుజ్రన్ వాలా, జీలమ్, బహవల్పూర్ తదితర జిల్లాల్లో దర్యాప్తు బృందాలు ముమ్మర సోదాలు చేస్తున్నాయి. ఈ సోదాల్లో భాగంగా అనుమానంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకున్నాయి. పదుల సంఖ్యలో అదుపులోకి తీసుకున్న వారిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పఠాన్ కోట్ దాడితో ఏమాత్రం సంబంధం ఉందని తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15న ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు భేటీ కావాల్సి ఉంది. అయితే పఠాన్ కోట్ దాడి నేపథ్యంలో తన భూభాగంపై ఉన్న సూత్రధారులపై పాక్ చర్యలు తీసుకుంటేనే చర్చలంటూ భారత్ షరతు విధించింది. అంతేకాక చర్చలను పక్కన పెట్టేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ క్రమంలో మొన్న రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్... దాడి జరిగిన తీరు, తమ దేశంలోనే సూత్రధారులున్నారంటూ భారత్ చేసిన ఆరోపణలు, అందించిన ఆధారాలపై ఆయన సమీక్షించారు. తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీసు శాఖలతో కలిపి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు. దాడికి వ్యూహరచన చేసినవారు తమ భూభాగంలో ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. షరీఫ్ ఆదేశాలతో వెనువెంటనే రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు మూడు జిల్లాల్లో ముమ్మరంగా దాడులు జరిపాయి. ఇంటింటినీ జల్లెడ పడుతున్న దర్యాప్తు అధికారులు ఇప్పటికే పదుల సంఖ్యలో అనుమానితులను అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నామని, దోషులుగా తేలిన ఏ ఒక్కరిని వదిలబోమని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి.

More Telugu News