: ఈ ఒత్తిడి భరించలేకపోతున్నా!... కేంద్ర హోం శాఖకు ‘కేజ్రీ’ ఐఏఎస్ లేఖ
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఏడాది వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి సత్తా చాటారు. అంతకుముందు సివిల్ సర్వెంట్ గా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. సివిల్ సర్వెంట్ పోస్టుకు రాజీనామా చేసిన కేజ్రీ, రాజకీయ తెరంగేట్రంతోనే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు. ఢిల్లీలో 15 ఏళ్ల షీలా దీక్షిత్ పాలనకు రోజుల వ్యవధిలో చరమ గీతం పాడేశారు. ఇక రెండో దఫా ఎన్నికల్లో మూడు దశాబ్దాల తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి షాకిచ్చారు. ఏడాది వ్యవధిలో రెండో దఫా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మట్టికరిపించిన కేజ్రీ, బీజేపీని సింగిల్ డిజిట్ కు జార్చారు. రెండో దఫా పాలనా పగ్గాలు చేపట్టిన కేజ్రీ, పాలనలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి చేతన్ సంఘీకి కీలక పోస్టును అప్పగించారు.
ఇక కేంద్రంతో రెండో దఫా ఢీకొట్టిన కేజ్రీ... బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ప్రత్యక్ష ప్రమేయముందని భావిస్తున్న డీడీసీఏ కుంభకోణాన్ని తిరగదోడారు. ఈ కేసులో జైట్లీ పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా కేజ్రీ సర్కారు రాబట్టింది. ఈ విషయంలో చేతన్ సంఘీ కీలకంగా వ్యవహరించారు. డీడీసీఏ వ్యవహారం తాజాగా కోర్టు మెట్లెక్కేసింది. అదే సమయంలో చేతన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు 15 రోజుల క్రితం ఓ లేఖ రాశారు. డీడీసీఏ వ్వవహారంపై దర్యాప్తు చేస్తున్న సమయంలో వివిధ వర్గాల నుంచి పెను ఒత్తిడి ఎదురైందని ఆయన వాపోయారు. ఓ ప్రముఖుడికి సంబంధించిన ప్రమేయాన్ని ప్రస్తావించరాదని తనపై ఒత్తిడి వచ్చిందన్న ఆయన, తనను కేంద్ర సర్వీసులకు బదిలీ చేయాలని కోరారు. చేతన్ అభ్యర్థనకు కేంద్రం ఎలా స్పందిస్తుందనే అంశాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఈ లేఖ కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చకే తెరలేపింది.