: పాతాళానికి క్రూడాయిల్... గ్రాము బంగారంతో బ్యారల్ ముడిచమురు కొనేయచ్చు!
అవును... మీరు చూసింది నిజమే. ఓ గ్రాము బంగారంతో బ్యారల్ కన్నా ఎక్కువ ముడిచమురును కొనుగోలు చేయవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పాతాళానికి పడిపోయి, 11 ఏళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. నేటి ఆసియా మార్కెట్ సెషన్లో బ్రెంట్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 11 శాతం దిగజారి బ్యారల్ కు 33.32 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ధర ఔన్సుకు (సుమారు 28 గ్రాములు) 4 శాతం పెరిగి 1,103.58 డాలర్లకు చేరుకుంది. అంటే, ఔన్సు బంగారంతో 33 బ్యారళ్ల ముడి చమురును సొంతం చేసుకోవచ్చన్నమాట. బంగారం, ముడిచమురు మధ్య ఇంత వ్యత్యాసం నమోదు కావడం 1988 తరువాత ఇదే తొలిసారని నిపుణులు అంటున్నారు. కాగా, దీర్ఘకాల ట్రెండ్ ను పరిశీలిస్తే, బంగారం ఔన్సు ధరకు సరాసరిన 16 బ్యారళ్ల ముడి చమురు లభించేది. గత రెండు దశాబ్దాల చరిత్రలో క్రూడాయిల్ ధర ఇంత ఘోరంగా పతనం కావడం ఎన్నడూ చూడలేదని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. 2008లో మాంద్యం సమయంలో సైతం క్రూడాయిల్, బులియన్ మార్కెట్లు కుదేలు కాగా, అప్పుడు కూడా ఇంత వ్యత్యాసం నమోదు కాలేదు. ఇక పెట్టుబడులకు బంగారాన్ని స్వర్గధామంగా భావించే ఇన్వెస్టర్లు, ఇప్పుడు ముడి చమురు మార్కెట్ వైపు ఆకర్షితులు కావచ్చని అంచనా.