: మూడు ఫోన్ నెంబర్లే సరిపోవుగా!...పఠాన్ కోట్ దాడి వెనుక పాక్ ప్రమేయంపై పొరుగు దేశం వింత వాదన

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి పాకిస్థాన్ ప్రమేయముందన్న వాదనపై ఆ దేశ దర్యాప్తు అధికారులు వితండ వాదన చేస్తున్నారు. పఠాన్ కోట్ దాడితో ఈ నెల 15న జరగాల్సిన ఇరు దేశాల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ రద్దయిపోయింది. పఠాన్ కోట్ దాడి సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే చర్చలని భారత్, పాక్ కు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రెండుసార్లు అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్రపై విచారణ జరపాలని ఆయన ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ కు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే, పఠాన్ కోట్ లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దాడికి ముందు పాకిస్థాన్ కు చెందిన మూడు ఫోన్ నెంబర్లుకు ఫోన్ చేశారు. సదరు నెంబర్లలో ఓ నెంబరు ఓ ఉగ్రవాది పాక్ లోని తన తల్లికి చేయగా, మరో నెంబరుకు ఫోన్ చేసిన ఉగ్రవాదులు పాక్ లోని తమ బాసుతో మాట్లాడారు. ఇక ఉగ్రవాదులు ఫోన్ చేసినట్లుగా భావిస్తున్న మూడో ఫోన్ నెంబరు కూడా పాక్ కు చెందినదే. ఈ మూడు నెంబర్లకు వెళ్లిన ఫోన్ కాల్స్ ఆధారంగా పాక్ నుంచే దాడి జరిగిందని తేలిపోయిందని భారత్ వాదిస్తోంది. అంతేకాక సదరు ఆధారాలను కూడా భారత్, పాక్ కు అందజేసింది. అయితే, కేవలం ఆ మూడు ఫోన్ నెంబర్ల ఆధారంగానే పాక్ నుంచే దాడికి కుట్ర జరిగిందని ఎలా చెబుతారని ఆ దేశ దర్యాప్తు అధికారులు ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకవేళ పాక్ భూభాగం మీదే దాడికి కుట్ర జరిగిందనుకున్నా, ఈ మూడు ఫోన్ నెంబర్ల సాక్ష్యాలు కోర్టులో నిలవవని కూడా వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని ఆధారాలు కావాలని వారు భారత్ ను కోరుతున్నారు. వెరసి, ముంబై దాడులకు సంబంధించి ఎంతమేర ఆధారాలు సమర్పించినా, మరిన్ని వివరాలు కావాలంటూ కాలయాపన చేస్తున్న తమ పాత వైఖరినే ఆ దేశ దర్యాప్తు అధికారులు అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More Telugu News