: చిత్తూరు జిల్లా సభలో సీఎంను మెప్పించిన బాలిక... ఉబ్బితబ్బిబ్బయిన చంద్రబాబు!

చిత్తూరు జిల్లాలో ఇవాళ నిర్వహించిన 'జన్మభూమి-మనఊరు' కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎనిమిదో తరగతి చదువుతున్న రాజేశ్వరి అనే బాలిక సీఎం చంద్రబాబును ఆకట్టుకుంది. పేద కుటుంబానికి చెందిన ఈ బాలిక మాల్వాజి మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటోంది. అయితేనేం, తమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణంతో పెరిగిన ఆత్మగౌరవ అనుభూతిని పంచుకునే అవకాశం రావడంతో జన్మభూమి సభావేదికపై అనర్గళంగా మాట్లాడింది. ప్రభుత్వ సాయంతో బాలికలు సంతోషంగా ఉన్నారని ప్రారంభించి, ఐఐటీ ఫౌండేషన్ పై శిక్షణ పొందడం ద్వారా అందరూ విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నారని వివరించింది. దాంతో తమలో తమకే పోటీ పెరుగుతోందని తెలిపింది. అంతేగాక స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి కట్టుబడి ఉంటామని, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, ఇంకా తదితర పథకాల పేర్లను తడబడకుండా ఆ బాలిక చెప్పింది. ఈ సమయంలో బాలిక ప్రసంగానికి ముగ్ధుడైన చంద్రబాబు ఆనందం తట్టుకోలేక లేచి మైకు తీసుకున్నారు. గ్యాలరీలోని మీడియావైపు చూస్తూ 'రాజేశ్వరిని చూసి ప్రెస్ వాళ్లు నేర్చుకోవాలయ్యా' అన్నారు. ఆ అమ్మాయి మాదిరిగా ఎవరూ మాట్లాడలేదని వేదికపై ఉన్న నేతలనుద్దేశించి అన్నారు. ఇంత తెలివైన దానివి, మరి నీ లక్ష్యం ఏంటని రాజేశ్వరిని చంద్రబాబు ప్రశ్నించారు. తాను ఐఏఎస్ అధికారిని కావాలనుకుంటున్నట్టు తెలిపింది. ఐఏఎస్సే ఎందుకు కావాలనుకుంటున్నావని సీఎం మళ్లీ ప్రశ్నించగా, ప్రజలకు సేవ చేయడానికని సమాధానమిచ్చింది. మరి పొలిటీషియన్ కావాలని లేదా? అని సీఎం అడగ్గా... అలాంటి ఆలోచన లేదని బాలిక చెప్పగానే నేతలంతా ఆశ్చర్యపోయారు. వీళ్లెవరూ నీలో స్పూర్తిని నింపలేదా? అని వేదికపైనున్న నేతలవైపు చంద్రబాబు చూడగానే నవ్వులు పూశాయి. తనను అంతగా మెప్పించిన బాలికకు వెంటనే చంద్రబాబు ట్యాబ్ ప్రకటించగా, జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ వెంటనే దాన్ని తెప్పించారు. ఆ వేదికపైనే రాజేశ్వరికి సీఎం ట్యాబ్ అందజేశారు.

More Telugu News