: జర్మనీ చాన్సలర్ కార్యాలయం వద్ద అప్రమత్తమైన భద్రతాసిబ్బంది!
జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యాలయం సమీపంలో పసుపు రంగులో ఉన్న నాలుగు ప్లాస్టిక్ క్రేట్లు కనపడ్డాయి. వెంటనే అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. కార్యాలయాన్ని సీల్ చేశాయి. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని జర్మనీకి చెందిన ఫెడరల్ పోలీసు అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, జర్మనీ చాన్సలర్ కార్యాలయం వద్ద కేబినెట్ సమావేశం నిమిత్తం మంత్రులు ఈరోజు అక్కడికి చేరుకున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొత్త ఏడాదిలో యూరప్ దేశాలపై మరిన్ని దాడులకు పాల్పడతామంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల భద్రతాధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు.