: భారతీయుల్లో పెరిగిన కొనుగోలు శక్తి!


భారతీయుల్లో కొనుగోలు శక్తి పది నెలల గరిష్ఠస్థాయికి చేరింది. బుధవారం నాడు విడుదలైన పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. కొంతకాలం వరకూ స్థిరంగా సాగిన సేవా రంగం ఊపందుకోవడంతో డిసెంబర్ పీఎంఐ లో 53.6 పాయింట్లకు చేరింది. అంతకుముందు నవంబరులో పీఎంఐ 50.1 పాయింట్ల వద్ద కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ గణంకాలు 50 పాయింట్లను దాటితే, వృద్ధి కొనసాగుతున్నట్టే. "గత రెండు నెలలుగా వివిధ రంగాల్లో, ఉప రంగాల్లోని గణాంకాలు వృద్ధి బాటను చూపుతున్నాయి. ఆర్థిక సేవా రంగంలో హోటల్స్, రవాణా, స్టోరేజ్ విభాగాల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది" అని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సేవలందిస్తున్న మార్కిట్ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. కాగా, డిసెంబరులో ఐటీ ఆధారిత రంగం అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2015 ప్రారంభంలో అంత సంతృప్తికర ఫలితాలను చూపని రియల్ ఎస్టేట్ వంటి ప్రైవేటు రంగంలో సంవత్సరం చివరకు వచ్చే సరికి వ్యాపారం పుంజుకుందని కేంద్ర అర్థగణాంక శాఖ విడుదల చేసిన వివరాలు తెలుపుతున్నాయి.

  • Loading...

More Telugu News