: జగన్ పత్రికపై పరువునష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే యరపతినేని
అక్రమ మైనింగ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక రాతలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. సరస్వతీ సిమెంట్ కోసమని రైతుల నోళ్లు కొట్టి అక్రమంగా ఆక్రమించిన భూముల కోసమే తన పేరును మైనింగ్ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. ఈ తరహా బ్లాక్ మెయిలింగ్ లకు తాను బెదరనని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ జగన్ పత్రిక పతాక శీర్షికన వార్త రాయడాన్ని యరపతినేని తప్పుబట్టారు. హైకోర్టు ఎక్కడా తన పేరు ఉపయోగించలేదని, కనీసం ఉచ్చరించనూ లేదని చెప్పారు. అందుకని ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.