: 2016లో టెక్కీల ముందున్న 5 హాట్ జాబ్స్... వేతనమూ భారీగానే!
మరో కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం టెక్నాలజీ విభాగానిదే కీలక పాత్రని, ఎన్నో రంగాల్లో మరింత సాంకేతికత, జీవన ప్రమాణాలను మెరుగుపరచనుందని ఇప్పటికే విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2016లో టెక్కీల ముందున్న 5 హాట్ జాబ్స్ వివరాలివి. ఈ పోస్టులు సంపాదిస్తే, వేతనమూ భారీగానే ఉంటుందట సుమా... 1. డిజిటల్ మార్కెటింగ్ హెడ్స్: మరిన్ని కంపెనీలు ఆన్ లైన్లో తమ అవకాశాలను వెతుక్కుంటూ, ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ కంపెనీలకు తమ డిజిటల్ మార్కెటింగ్ టీంను బలోపేతం చేసుకోవడమన్నది పెద్ద సవాలేనని మైఖేల్ పేజ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ నికోలస్ డుమోలిన్ అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో నిష్ణాతులైన వారికి సాలీనా రూ. 30 నుంచి రూ. 60 లక్షల వరకూ వేతనాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 2. ప్రొడక్ట్ డెవలపర్స్: ఐటీ కంపెనీలు తమ సేవలను విస్తరించుకునే పనిలో ఉన్నాయి. డిమాండ్ కు తగ్గట్టుగా ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలన్న విషయంలో వినూత్న ఆలోచనలతో వచ్చే టెక్కీలకు కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త కంపెనీలు ప్రొడక్ట్ డెవలపింగ్ టీంను బలంగా ఉండేలా చూసుకుంటున్నాయని మాన్సర్ కన్సల్టింగ్ సంస్థ సీఈఓ సత్యా సిన్హా వ్యాఖ్యానించారు. వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీలున్న వారికి ప్రొడక్ట్ డెవలపర్ గా ఉద్యోగం వస్తే సాలీనా జూనియర్ స్థాయిలో రూ. 15 లక్షలకు పైగా, సీనియర్లకు రూ. 50 లక్షలకు పైగా వేతనాలు అందుతాయి. 3. సీనియర్ మేనేజర్స్ - ఈ-కామర్స్: శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగానిదే 2016 సంవత్సరమనడంలో సందేహం లేదు. వివిధ ప్రొడక్టులను వెబ్ సైట్లో తీర్చిదిద్దడం, తమ కింద పనిచేసే వారిని సరైన దారిలో నడిపించడంలో నైపుణ్యం చూపగలిగే వారికి ఈ-కామర్స్ కంపెనీలు ఎంతయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అది రూ. 1 కోటి గానీ, రూ. 10 కోట్లుగానీ సత్తా ఉన్న టెక్కీలకు ఈ-కామర్స్ సంస్థలు ఓ వరం. 4. డేటా అనలిటిక్స్: చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకూ టెక్నాలజీ విభాగంలో సమాచార విశ్లేషణ అత్యంత కీలకం. గణితశాస్త్రంతో పాటు, విశ్లేషణా సామర్థ్యమున్న వారికి కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ విభాగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఈ సంవత్సరం వెల్లువెత్తుతాయని అంచనా. ప్రారంభ దశలో రూ. 10 లక్షల వరకూ, సీనియర్ పోస్టుల్లో రూ. 70 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ వేతనాలు అందుతాయి. 5. మొబైల్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్: గత సంవత్సరం చివరి నాటికి మొబైల్ వాడకందారుల సంఖ్య 50 కోట్లను దాటిందన్నది జీఎస్ఎంఏ నివేదిక అంచనా. ఇక మొబైల్ ద్వారా నెట్ సేవలు పొందుతున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతుండటంతో, ప్రొడక్ట్ డెవలప్ మెంట్ ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా కన్స్యూమర్ టెక్నాలజీలో మంచి ఉత్పత్తులను తయారుచేయగలిగితే వారికి ఐటీ కంపెనీలు మంచి వేతనాలు ఇస్తున్నాయి. వినూత్న మొబైల్ యాప్ లను తయారు చేసే వారికి ఎంట్రీ లెవల్ లో రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షలు, సీనియర్ పోస్టులకు రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల వేతనాలు అందుతాయి.