: పఠాన్ కోట్ లో మళ్లీ పేలుడు... కాల్పుల మోత

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో చొరబడ్డ ఉగ్రవాదులు భద్రతా దళాలకు పెను సవాళ్లు విసురుతున్నారు. మూడు రోజులుగా భద్రతా దళాలకు కొరుకుడు పడని ఉగ్రవాదులు తమ ప్రతాపం చూపుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆరుగురు సహచరులు చనిపోయినా, మిగిలిన ఒకరిద్దరు పెను విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తూనే ఉన్నారు. శనివారం తెల్లవారుజామున మొదలైన ఉగ్రవాదుల దాడి, భద్రతా దళాల ఎదురు దాడితో పఠాన్ కోట్ ప్రాంతం కాల్పుల శబ్దంతో మోత మోగుతోంది. ఇప్పటికే ఏడుగురు సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు, ఎయిర్ బేస్ లో నక్కి నక్కి దాడికి పాల్పడుతున్నారు. విలువైన సామగ్రి ఉన్న ప్రాంతంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాలను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం ఎయిర్ బేస్ లో మరో భారీ పేలుడు సంభవించింది. వెనువెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఉగ్రవాదులపై కాల్పులను ప్రారంభించాయి. అటు వైపు నుంచి కూడా ఉగ్రవాదులు తుపాకులు పేలుస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేటి ఉదయం పఠాన్ కోట్ చేరుకున్న డీజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు.

More Telugu News