: పాక్ తో ఇక చర్చలొద్దంటున్న ఇండియన్స్!
ఇండియాను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పాకిస్థాన్ ఉగ్రదాడులు చేయిస్తున్న వేళ, ఆ దేశంతో శాంతి చర్చలు అక్కర్లేదని అత్యధిక శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. పఠాన్ కోట్ పై దాడి తరువాత పాక్ తో చర్చలు అవసరమా? అని ప్రశ్నిస్తూ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ పోల్ నిర్వహించగా, ఇందులో పాల్గొన్న 71 శాతం మంది 'వద్దు' అని సమాధానం ఇచ్చారు. కాగా, ఈ దాడి తరువాత పాక్ తో వ్యవహరిస్తున్న తీరుపై మోదీ మీద రాజకీయ ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరు దేశాల మధ్యా శాంతి పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో ఇటీవలి కాలంలో మోదీ స్వయంగా చొరవ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే, ఆయన అకస్మాత్తుగా లాహోర్ లో దిగాలని నిర్ణయించుకుని, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు సైతం చెప్పి వచ్చారు. ఈ దాడుల తరువాత పాకిస్థాన్ కు గట్టి సమాధానం చెప్పాలన్నది భారతీయుల అభిప్రాయం.