: 11 గంటల సుదీర్ఘ సమావేశం అనంతరం రాత్రి 11 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం
నిన్న ఉదయం 11:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకూ జరిగిన సుదీర్ఘ మంత్రివర్గ సమావేశం అనంతరం రాత్రి 11 గంటల సమయంలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి, మంత్రి మండలి తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. మొత్తం 15,628 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన ఆయన, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోపు కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు వివరించారు. ఏ విభాగంలోనూ అవినీతి, పైరవీలకు ఆస్కారం లేకుండా చూస్తామని తెలిపారు. ఫుట్ పాత్ వ్యాపారులకు భద్రత, గుర్తింపు కార్డులు ఇస్తామని, 200 యూనిట్లలోపు కరెంటును వాడే సెలూన్లను గృహ కేటగిరీకి మార్చుతామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు బేసిక్ వేతనంపై 30 శాతం కాలుష్య భత్యం ఇస్తామన్నారు. కొత్తగా 60 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. కాగా, కేసీఆర్ క్యాబినెట్ ఇంత సుదీర్ఘంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. మొత్తం 60కి పైగా అంశాలను మంత్రి మండలి చర్చించింది.