: బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుంది: అరుణ్ జైట్లీ
రానున్న బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఐఆర్ఎస్ శిక్షణాధికారులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వస్తుసేవల పన్నుల బిల్లుకు అనుకూలంగా సభ్యులు ఓటు వేస్తారని అన్నారు. బడ్జెట్ సమావేశాలలోపు రాజ్యసభలో జీఎస్టీ బిల్లుకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నామని ఆయన చెప్పారు. అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలు కీలకమైనవని, రాజ్యసభకు కొత్త సభ్యులు రానున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందుతుందనే విశ్వాసంతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, గత రెండు పార్లమెంటు సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై సవరణలు కోరుతూ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.