: 2016లో నరేంద్ర మోదీ లక్ష్యాలివే!

కొత్త సంవత్సరంలో ఎనిమిది ముఖ్యమైన రంగాల్లో లక్ష్యాలను నిర్దేశించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, వాటి సాకారానికి అధికారులు సహకరించాలని కోరారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో తన ఇంట్లో సమావేశమైన మోదీ, కొత్త సంవత్సరంలో తాను చేయాలనుకున్న పనులను వివరించారు. ప్రాధాన్యతా రంగాలను వివరించి, తన సిఫార్సులు అమలయ్యేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరారు. ప్రొడక్ట్, ప్రాసెస్, డెలివరీపై ప్రధానంగా దృష్టిని సారించాలని, 'సిటిజన్ జడ్జ్' విధానాన్ని అమలు చేయాలని సూచించారు. చేపట్టిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, రాజకీయాల గురించి పట్టించుకోవద్దని, ఏ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఎలాగున్నా వాటిని అంగీకరించి ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మోదీ చెప్పినట్టు, పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఉన్నతాధికారి వివరించారు. కాగా, దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీఎంఓ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. తాము అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రాధాన్యతలను గుర్తించి, లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగు వేయాలని, ఎప్పటికప్పుడు అవి అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తుండాలని మోదీ తన న్యూ ఇయర్ విజన్ ను అధికారుల ముందుంచారు. సుపరిపాలన, ఉద్యోగ సృష్టి, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, నిధుల కేటాయింపులు, సమ్మిళిత వృద్ధి, స్వచ్ఛ భారత్, గంగా నది శుద్ధి, ఇంధన వినియోగం అంశాల్లో మరింత మెరుగైన పనితీరును ఆయన కోరారు.

More Telugu News