: బీహార్ లో తేడాలొచ్చాయ్... నితీష్ వల్లే ఘోరాలంటున్న ఆర్జేడీ

మహాకూటమిగా ఏర్పడి, ఆపై బీజేపీని మట్టి కరిపించి బీహార్ లో అధికారాన్ని సొంతం చేసుకున్న నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీల హనీమూన్ ముగిసినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో నేరాలు, హత్యలు వంటి ఘోరాలు పెరగడానికి సీఎం నితీష్ వైఖరే కారణమని ఆర్జేడీ ఆరోపించింది. పరిస్థితిని ఆయన సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. గడచిన వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఇంజనీర్లు హత్యకు గురికావడం, ఆపై జాతీయ మీడియాలో 'జంగిల్ రాజ్' మరోసారి వచ్చేసిందని కథనాలు ప్రచురితం కావడంతో బీహార్ సర్కారు ఇరుకునపడ్డట్లయింది. ఇటీవలి హత్యలతో బీహార్ లో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదన్న సంకేతాలు వెలువడ్డాయని, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తమ పార్టీ, సుపరిపాలన కోసం ప్రయత్నిస్తుందని అన్నారు. పెరుగుతున్న నేరాలపై లాలూ కుమారులు చేస్తున్న విమర్శలను రఘువంశ్ వెనకేసుకొచ్చారు. వారు ఉన్న పరిస్థితినే వివరించారని అన్నారు.

More Telugu News