: రేపటి నుంచి ఇండియాకు ఆర్థిక సహాయం నిలిపేస్తున్న బ్రిటన్

నూతన సంవత్సరం నుంచి ఇండియాకు ఏ విధమైన ఆర్థిక సహాయం చేయరాదని బ్రిటన్ నిర్ణయించింది. భారత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని, అటువంటి పరిస్థితుల్లో తమ సాయం ఎందుకని 2012 సంవత్సరంలో బ్రిటన్ లో ఆందోళనలు చెలరేగిన వేళ, 2015 వరకు మాత్రమే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సమయం పూర్తి కావడంతో, జనవరి 1 నుంచి బ్రిటన్ నుంచి ఆర్థిక సహాయం ఇక అందదు. పాత ఫైనాన్షియల్ ప్రాజెక్టులు సైతం పూర్తయ్యాయి. గతంలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం బ్రిటన్ ఇచ్చిన నిధుల్లో మిగిలిన వాటిని 'టెక్నికల్ అసిస్టెంట్' ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చని బ్రిటన్ తెలిపిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, 2012లో ఆర్థికమంత్రిగా ప్రణబ్ ముఖర్జీ ఉన్న సమయంలో లండన్ ప్రభుత్వం నిధులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో బ్రిటన్ నిధులు భారత ఆర్థిక వ్యవస్థలో ఓ చిన్న నలుసు మాత్రమేనని, అవి లేకుండా కూడా ఇండియా ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించగా, దానిపై లండన్ లో నిరసనలు చెలరేగాయి. దాని ఫలితమే ఇది. 2013లో రూ. 855 కోట్లు, 2014లో రూ. 601 కోట్లు, 2015లో రూ. 190 కోట్ల ఆర్థిక సాయం బ్రిటన్ నుంచి రాగా, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్యం, సుపరిపాలన, పట్టణ సంస్కరణల విభాగాల్లో వాటిని ఖర్చు చేశారు.

More Telugu News