: తిరుమలలో న్యూఇయర్ నిబంధనలు కఠినతరం!
తిరుమలలో న్యూఇయర్ నిబంధనలు కఠినతరం చేశారు. ఈ నెల 31 నుంచి జనవరి 3 వ తేదీ వరకు తిరుమలలో అన్ని ప్రత్యేక దర్శనాలు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. టీటీడీ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. నూతన సంవత్సరం జనవరి 1న శ్రీవారి దర్శన ఏర్పాట్లపై సమీక్షించారు. కొత్త ఏడాది మొదటి రోజున పరిమిత సంఖ్యలోనే ప్రొటోకాల్ వీఐపీ టిక్కెట్లు జారీ చేస్తామని, వీఐపీ దర్శనాలకు సిఫారసు లేఖలు అనుమతించమని ఆయన తెలిపారు. నడకదారి భక్తులకు ఇవాళ అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు దివ్యదర్శనం టోకెన్లు, కార్డుల జారీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఫొటో మెట్రిక్ రీ ఎంట్రీ కార్డుల జారీని నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి జనవరి 3 వ తేదీ వరకు అన్ని ప్రత్యేక దర్శనాలు నిలిపివేతతో పాటు గదుల ముందస్తు బుకింగ్ ను కూడా రద్దు చేసినట్లు ఈవో తెలిపారు.