: నటుడు శింబుకు స్వల్ప ఊరట... కేసు ఉపసంహరించుకున్న పిటిషన్ దారు
బీప్ సాంగ్ వివాదంతో గత కొన్ని రోజుల నుంచి కలకలం రేపుతున్న తమిళ నటుడు శింబుపై పెట్టిన కేసును పీఎంకే (పాట్టాలీ మక్కల్ కట్చి) పార్టీ నేత వెంకటేశన్ ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నైలోని సైదాపేట కోర్టులో నిన్న(సోమవారం) విచారణ జరిగింది. ఆ సమయంలో కోర్టుకు హాజరైన వెంకటేశన్ హఠాత్తుగా తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఆయన పిటిషన్ వాపస్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో శింబుకు స్వల్ప ఊపశమనం కలిగిందనుకోవచ్చు.
మరోవైపు మహిళలను కించపరిచేలా బీప్ సాంగ్ రాసి, పాడారంటూ శింబుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పలు విభాగాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో శింబు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.