: ‘చెన్నై కేజ్రీవాల్’గా ఐఏఎస్ సహాయం... వరదల తర్వాత పోటెత్తుతున్న మద్దతు

తమిళ నాట గ్రానైట్ మాఫియాకు ముచ్చెమటలు పట్టించిన ఐఏఎస్ అధికారి యు.సహాయం గుర్తున్నారుగా? గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి వికలాంగులను బలిచ్చిన కాంట్రాక్టర్లపై దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సహాయం, సాక్ష్యాలను కాపాడే క్రమంలో ఓ రాత్రి ఏకంగా శ్మశానంలోనే నిద్రపోయారు. ఓ కడ్డీల మంచం తెప్పించుకున్న ఆయన నిర్భయంగా శ్మశానంలో పడుకుని గ్రానైట్ మాఫియాతో పాటు తమిళనాడు సర్కారుకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేశారు. తాజాగా ఆయన ‘చెన్నై అరవింద్ కేజ్రీవాల్’ గా మారనున్నారు. ఈ మేరకు ‘ఇలక్కు’ పేరిట తిరుచ్చికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మిస్డ్ కాల్ ప్రచారానికి మద్దతు వెల్లువెత్తుతోంది. మొన్న తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు పరిసర జిల్లాలను రెండు దఫాలుగా వర్షం ముంచెత్తింది. దీంతో చెన్నై నగరం పూర్తిగా నీటమునిగింది. ఇంకా ఆ నగరం వరద విషాదం నుంచి తేరుకోలేదు. వరదల నాటి కంటే ముందే ఐఏఎస్ సహాయంపై మిస్డ్ కాల్ ప్రచారం ప్రారంభమైనా, వరద తర్వాత ఆ ప్రచారానికి మద్దతు వెల్లువెత్తింది. వరదలకు ముందు 10 వేల మిస్డ్ కాల్స్ దాకా వస్తే, వరదల తర్వాత ఆ సంఖ్య లక్ష దాటిపోయింది. ఇదే రీతిన మద్దతు వెల్లువెత్తితే, రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో పాటు విపక్ష డీఎంకేకు కూడా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.

More Telugu News